Site icon Prime9

AP Officials on leaves: ఏపీలో కూటమి విజయం..సెలవులు, రాజీనామాల బాటలో అధికారులు

AP Officials

AP Officials

AP Officials on leaves: ఆంధ్రప్రదేశ్ శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇప్పటి వరుకు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన అధికారులు రాజీనామా లు చేసే పనిలో పడ్డారు .కొంత మంది సెలవలు పెడుతున్నారు . ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5 నుంచి జులై 3 వరకూ ఆయన సెలవు పెట్టారు.

సెలవుపైన సీఐడీ డీజీ సంజయ్ ..(AP Officials on leaves)

వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ వంటి కేసుల్లో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చంద్రబాబును అరెస్ట్ కూడా చేశారు.
అదే విధంగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. మరో వైపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు కొందరు తమ రాజీనామా లేఖలను ఏజీకి సమర్పించారు.

అదే క్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు పంపించారు. అయితే, రాజీనామాను ఆమోదించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం లేకపోవడంతో.. ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకూ ఆయనకు సెలవు మంజూరు చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు చూసిన ఆయన కొన్ని కీలక దస్త్రాలు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

టీటీడీ ఛైర్మన్ రాజీనామా..

ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవంతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈవో ధర్మారెడ్డికి పంపించారు. గతేడాది ఆగస్టులో ఆయన తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, అభివృద్ధి పనుల పేరిట దేవస్థానం నిధులను పక్కదారి పట్టించారని ఆయన్ను పలుమార్లు ప్రతిపక్షాలు విమర్శించాయి.

సెలవులో టీటీడీ ఈవో.?..

మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సైతం వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి 10 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం ఇంకా పదవిలో కొనసాగుతున్నారు .

Exit mobile version