Kodikatthi case: విశాఖ పట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి కేసులో ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని గతంలో సిఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని ఇప్పుడు ఎన్ఐఎ కోర్టు కొట్టేసింది.
విజయవాడలో విచారణ సాధ్యం కాదు..(Kodikatthi case)
సీఎం జగన్‌కి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశంపై వచ్చే నెల 1న విచారణ చేపడతామని ఎన్ఐఎ కోర్టు తెలిపింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా వచ్చే నెల 1కి వాయిదా వేసింది. శ్రీనివాస్‌ను విజయవాడ జైలులో ఉంచి విచారించాలని అతడి తరపు లాయర్ కోరారు. అయితే విజయవాడ జైలులో ఖైదీల సామర్థ్యం దృష్ట్యా అక్కడ విచారణ సాధ్యం కాదని అధికారులు కోర్టుకి తెలిపారు.
2018 అక్టోబర్ నెలలో నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పై ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కోడికత్తితో దాడిచేసాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఈ ఘటన వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది.నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని విచారణలో తేలిందని పేర్కొంది.ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు, హోటల్ ఉద్యోగి జానిపల్లి శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీతో లేదా మరే ఇతర రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొంది.రెస్టారెంట్ యజమాని టి హర్షవర్ధన్ ప్రసాద్ టిడిపి సానుభూతిపరుడే అయినప్పటికీ, కేవలం కార్మికుడు మాత్రమే అయిన నిందితుడితో అతనికి ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది.