YS Sharmila: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్పార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను షర్మిల తన పాదయాత్ర ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు.
పల్లె పల్లె కు తిరుగుతూ ప్రజల సమస్యలను వింటున్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా లక్ష్మీనారాయణపురం వద్ద షర్మిల కల్లు గీత కార్మికుడితో మాట్లాడారు.
అయితే ఈ సందర్భంగా కల్లు రుచి చూడాలన్న గీత కార్మికకుడి విజ్ఞప్తి మేరకు షర్మిల నీరా రుచి చూశారు. లక్ష్మీనారాయణపురం స్టేజి వద్ద ఓ కల్లు గీత కార్మికుని కోరిక మేరకు నీరాను రుచి చూశారు.
తనకు అలవాటు లేదని చెప్పిన షర్మిల.. గీత కార్మికుడి విజ్ఞప్తితో కొద్దిగా నీరాను తాగారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.
ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
దేవరుప్పుల మండలంలోని దుకాణాలను మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
కేసీఆర్, కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే మరో వైపు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటూ ఉండటం ఆసక్తిగా మారింది.