Site icon Prime9

Telangana : కామారెడ్డిలో యువకుడి ఘటన ఆ హాలీవుడ్ మూవీలా ఉందంటున్న నెటిజన్లు

young man stuck in cave on telangana and rescue oparations continues

young man stuck in cave on telangana and rescue oparations continues

Telangana : కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 13వ తేదీన రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్‌పూర్‌ శివారులో అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో దానిని తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయాడు. కాగా ఇప్పటికీ కూడా అతన్ని బయటికి తీసేందుకు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రాజు ఇరుక్కుని దాదాపు 40 గంటలు గడుస్తున్న తరుణంలో నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది.

హాలీవుడ్ మూవీ తరహాలో … 

అయితే ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పలువురు నెటిజన్లు ఈ ఘటన ఒక హాలీవుడ్ సినిమాని పోలి ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. 2010 లో ” 127 అవర్స్ ‘ అనే హాలీవుడ్ మూవీ రిలీజ్ అయ్యింది. బయోగ్రాఫికల్ సైకలాజికల్ సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి డానీ బాయిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జేమ్స్ ఫ్రాంకో, కేట్ మారా, అంబర్ టాంబ్లిన్, క్లెమెన్స్ పోసీ నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం గమనార్హం.

ఏప్రిల్ 2003లో, ఆసక్తిగల పర్వతారోహకుడు అరోన్ రాల్‌స్టన్ ఎవరికీ చెప్పకుండా ఉటాస్ కాన్యన్‌ల్యాండ్స్ నేషనల్ పార్క్‌లో హైకింగ్‌కు వెళ్తాడు. అయితే అనుకోని రీతిలో కొండ మధ్యలో జారి పడే సంధర్భంలో బండరాయికి మధ్యలో అతని చేయి ఇరుక్కుపోతుంది. అతనిని కాపాడడానికి తోడుగా ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా అతను ఏం చేశాడు, చివరికి ఎలా తప్పించుకున్నాడు అనేది చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. చివరకు ఈ సినిమాలో చేసేది ఏం లేక తన చేతిని తానే కోసుకొని బయటపడిన హీరో, ఆ తర్వాత కొంతమంది సాయంతో ప్రాణాలను కాపాడుకుంటాడు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఎవరికి చెప్పకుండా వెళ్లాడమే తాను చేసిన తప్పు అని హీరో గ్రహిస్తాడు.

అయితే ఇప్పుడు కామారెడ్డి ఘటన లోనూ మిత్రుడు మహేశ్‌తో కలిసి వేటకు వెళ్ళిన రాజు అనుకోని రీతిలో ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపించాయి. వేటకు వెళ్లిన కారణంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు శ్రమించారు. వీలు కాదని తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంలో వీరు కూడా ఎవరికి చెప్పకుండా కాలాన్ని వృధా చేయడమే ఇప్పుడు అతనికి సమస్యగా మారిందని అంతా భావిస్తున్నారు.

రాజు ప్రస్తుత పరిస్థితి…

రాజును బయటకు తీసేందుకు ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దాదాపు 40 గంటలు పైగా గడుస్తున్న తరుణంలో నిద్ర, ఆహారం లేకుండా అతని ఆరోగ్యం క్షీణిస్తుందని భావిస్తున్నారు. అతన్ని సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈరోజు ఉదయం బండరాళ్లను పేల్చేందుకు బాంబును కూడా పెట్టారు. అయితే బాంబ్ బ్లాస్ట్ లో అతనికి ఎటువంటి హాని జరగలేదని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Exit mobile version