TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ విద్యుత్ శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రవికిశోర్ ఖాతాలో పలు లావాదేవీలు(TSPSC)
అరెస్టు అయిన నిందితులు సురేశ్, రవికిషోర్, దివ్య, విక్రమ్ లు సైదాబాద్‌లో ఒకే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. సైదాబాద్‌లోని ఒక జిరాక్స్ కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు జిరాక్స్ తీసి విక్రయించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని పలు కోచింగ్ సెంటర్ల వద్ద పేపర్ అమ్మేందుకు నిందితులు తిరిగినట్టు దర్యాప్తులో తేలింది. రవికిశోర్ ఖాతాలో చాలా మందికి సంబంధించిన లావాదేవీలు కూడా బయటపడ్డాయి.
రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో ఏఈ పరీక్షలో పలువురు టాపర్లకు సంబంధించిన వివరాలు గుర్తించారు. కాగా, టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం.