Site icon Prime9

TSPSC: అప్లై చేయకుండానే హాల్ టికెట్.. రియాక్ట్ అయిన టీఎస్ పీఎస్సీ

TSPSC

TSPSC

TSPSC: తెలంగాణ లో గ్రూప్ 1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం (జూన్ 11) ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ విద్యార్థికి గ్రూప్ 1 హాల్ టికెట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన జక్కుల సుచిత్ర అనే విద్యార్థి గ్రూప్ 3, గ్రూప్ 4 లకు మాత్రమే అప్లై చేస్తే.. గ్రూప్ 1 హాల్ టికెట్ జారీ చేసినట్టు తెలిసింది.

 

తప్పుడు ప్రచారం(TSPSC)

దరఖాస్తు చేసుకోక పోయినా అభ్యర్థికి హాల్‌టికెట్ జారీ చేశారని జరుగుతున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివరణ ఇచ్చింది. ఆ వార్తలను టీఎస్‌పీఎస్సీ అధికారులు కొట్టి పారేశారు. జరిగిందంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. ‘నిజామాబాద్‌ అభ్యర్థి జక్కుల సుచరిత గతేడాది గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేశారు. అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షకు ఆమె హాజరయ్యారు. గ్రూప్‌-3, గ్రూప్‌-4 దరఖాస్తు చేస్తే గ్రూప్‌-1 హాల్‌టికెట్‌ ఇచ్చారన్న ప్రచారంలో నిజం లేదు.’ అని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

 

తగ్గిన హాజరు(TSPSC)

కాగా.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరిగింది. మొత్తం 994 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత ఏడాది జరిగి.. రద్దు అయిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. రెండో సారి నిర్వహించిన ఈ పరీక్షకు వారిలో దాదాపు 53 వేల మంది దూరంగా ఉన్నారు.

 

Exit mobile version