Site icon Prime9

TSPSC paper leak: పేపర్ లీకేజీ నిందితులను కస్టడీకి కోరుతూ ఈడీ పిటిషన్

TSPSC paper leak

TSPSC paper leak

TSPSC paper leak: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌ల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను అక్కడే ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు జైలు సూపరిండెంట్ ను ఆదేశించాలని కోరడంతో నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

 

కౌంటర్ తర్వాత వాదనలు(TSPSC paper leak)

ఈ అంశంపై నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు చంచల్ గూడ జైల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రాంచంద్రన్, అధికారులు సత్యనారాయణ, శంకరలక్ష్మిలను కార్యాలయానికి పిలిచి వాళ్ల వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకున్నారు.

 

ఈడీ అధికారులు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ నాయక్‌లతో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. సిట్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 27మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

Exit mobile version