TSPSC Paper Leak: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ ఎనలిస్ట్ రాజశేఖర్, కార్యదర్శి పీఏ ప్రవీణ్ అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కమిషన్ లోని మెుత్తం కంప్యూటర్ వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్ సిస్టమ్‌లో యాక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. ఎవరూ పసిగట్టలేకపోవడం గమనార్హం.
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి సమాచారమైన.. రాజశేఖర్ ప్రవీణ్ కు అందజేసేవాడు. రేణుక కోసమే తాను ప్రశ్నపత్రం లీకేజీ జరిగినట్లు మెుదట ప్రవీణ్ ఒప్పుకున్నాడు. కానీ అది అబద్ధమని తేలింది. లీకేజీ కేవలం ఆ పరీక్షకు మాత్రమే పరిమితమని నమ్మించేందుకే రేణుక ప్రస్తావన తెచ్చాడని.. వాస్తవానికి మిగతా ప్రశ్నపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిట్ సిద్ధం చేసిన నివేదికలో ఇలాంటి సంచలనాత్మక విషయాలెన్నో బయటపడుతున్నాయి.
ఆరు నెలలుగా ఈ దందా సాగుతుండటంతో.. నిందితులు మరింత ముందుకు వెళ్లారు. త్వరలో నిర్వహించబోయే అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు సిట్ విచారణలో తెలిసింది.
కమిషన్‌లో ప్రత్యేకంగా కాన్ఫిడెన్షియల్ విభాగం ఉంటుంది. దీనికి సూపరింటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
పరీక్షల కోసం సిద్ధం చేసే ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్‌కు ఐపీ అడ్రస్ మార్చాడు. ఈ క్రమంలోనే అక్టోబరులోనే గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రం తస్కరించాడు.
అక్టోబరు నుంచి ఇప్పటి వరకు పలు పరీక్షలు జరిగాయి. అక్టోబరు నుంచే ప్రవీణ్, రాజశేఖర్‌ల దందా నడుస్తోందన్న ఆధారాల నేపథ్యంలో మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలూ బయటకు తెచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది.
దాంతోపాటు ప్రవీణ్, రాజశేఖర్‌ల ఫోన్ డేటా ఆధారంగానూ దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో ఈ కేసులో మరింత మంది నిందితులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు.
అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడంపై అప్పట్లోనే వారి స్వగ్రామం జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది.
పరీక్ష రాసిన వారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. రాజశేఖర్ బంధువులు ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయ్యారు.
అయితే రాజశేఖర్ ముందే పేపర్ లీక్ చేసి బంధువులకు ఇచ్చాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్‌లను కార్యాలయానికి తీసుకొచ్చారు.
టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ రూంలోకి వాళ్లిద్దరినీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఆ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ను నిందితుల సమక్షంలోనే పరిశీలిస్తున్నారు పోలీసులు.
ఈ సిస్టమ్ నుంచే పేపర్ లీక్ కావడంతో.. అక్కడే వాళ్లను విచారిస్తోంది.