Site icon Prime9

Telangana SLBC tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు మృతి! ఆ మెత్తని భాగాలు మానవ దేహాలేనా? మంత్రి కీలక వ్యాఖ్యలు

Telangana SLBC tunnel accident Eight People were Buried Alive: తెలంగాణలోని శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకోగా.. గత ఏడు రోజులుగా అధికారులు, రెస్క్యూ బృందాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఘటనలో ఆధునాతన పరికరాలు, రాడార్‌లతో మృతదేహాలను గుర్తించినట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు ఉండగా.. ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మృతదేహాలను సొరంగం నుంచి బయటకు వెలికి తీసేందుకు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగంలో చేసిన స్కానింగ్‌లో ఐదు ప్రాంతాల్లో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే చిక్కుకున్న వారు అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతాల్లో స్కానింగ్‌లో గుర్తించిన మెత్తని భాగాలు మానవ దేహాలేనా? అంటూ అనుమానం వ్యక్తమవుతోంది. తవ్వకాలు జరిపితే ఈ విషయంపై స్పష్టత రానుంది.

అయితే, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఇరుక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన అంచనా ప్రకారం.. ఆ ఎనిమిది మంది ప్రాణాలు దక్కే అవకాశం వంద శాతం లేదని తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కానీ వారు బతికే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి భరోసా ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సొరంగంలో 14వ కి.మీ పాయింట్ వద్ద ఈనెల 22న ఉదయం 8.20 నిమిషాలకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టన్నెల్ బోర్ మిషన్‌పై ఒక్కసారిగా నీటితో పాటు మట్టి, రాళ్లు కూలాయి. ఇందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు చిక్కుకుపోయారు.

Exit mobile version
Skip to toolbar