Site icon Prime9

Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకు పోతున్న విద్యుత్ బకాయిలు.. పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం

Telangana government is not paying attention to the electricity dues accumulating in government schools

Hyderabad: తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది. ఇది భాగ్యనగరంలో ఎటు చూసినా ప్రజలను ఊదరగొట్టే ప్రభుత్వ ప్రకటనలు. ఒక దశలో ఈ ప్రకటనలు రాజకీయంగా కూడా దుమారం లేపుతూ కీలక ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ఎద్దేవా చేస్తుంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీరు పైన పటారం, లోన లొటారం అన్న సామెత మాటున ఉందంటూ సర్కారి సూళ్లు ఎత్తి చూపుతున్నాయి.

వివరాల్లోకి వెళ్లితే, జంట నగరాల్లోని 181 ఉన్నత పాఠశాలలకు సంబంధించి దాదాపుగా రూ. 15లక్షలు విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. కరెంటు బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖాధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో విద్యుత్ బిల్లులు చెల్లించమంటున్న అధికారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక్క విద్యుత్ సమస్యే పాఠశాలలను వెంటాడం లేదు. తాగునీరు, టేబుళ్లు సమస్య కూడా ఉంది.

ప్రతి నాలుగు నెలలకొకసారి విద్యుత్ బకాయిలకు సంబంధించిన నగదును ప్రభుత్వం విడుదల చేస్తుంటుంది. అయితే ఈ దఫా నిర్ణీత గడువు ముగిసినా బడ్జెట్ మాత్రం విడుదల కాలేదు. దీంతో విద్యుత్ శాఖాధికారుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈ క్రమంలోనే బకాయిల చెల్లింపుపై హైదరగూడలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యుత్ సిబ్బందితో స్వల్ప వాగ్వివాదం కూడా చోటుచేసుకొనింది. కరెంటు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. దానికి ధీటుగా ఉపాధ్యాయులు కూడా కట్ చేయండి, మేము ధర్నా చేస్తామని వారితో చెప్పడంతో వామ్మో అనుకుంటూ వెనుదిరిగారు.

బిల్లుల విషయమై జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపించి బకాయి బిల్లులను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో కరెంట్‌ సరఫరా నిలిచిపోయి పిల్లలకు చీకటి గదుల్లోనే పాఠాలు బోధించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: నగదు డ్రా చేస్తారు.. ఖాతాదారుడి అకౌంట్ లో కట్ కాదు.. ఎలా సాధ్యమంటే?

Exit mobile version