Telangana Government Approves SC Sub Classification: కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికకు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల మీద లోతైన చర్చ జరిగింది. అనంతరం ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చను నిర్వహించింది. ఈ క్రమంలో విపక్షాల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో బీసీ కులగణన, ఎస్సీల వర్గీకరణ అంశాలకు అసెంబ్లీ, శాసన మండలి ఆమోదం తెలిపాయి.
నాటి హామీకి కట్టుబడి..
బీసీ లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కుల గణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రిజర్వేషన్‌ను స్థానిక సంస్థల్లో 42 శాతానికి పెంచాలని నిర్ణయించామని అసెంబ్లీలో ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కులసర్వే నివేదిక సమగ్ర ఇంటింటి కులసర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళామని తెలిపారు.
50 రోజుల సర్వేలో..
తెలంగాణ వ్యాప్తంగా 50 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించారు. సర్వే తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుని 75 అంశాల ప్రాతిపదికగా సర్వేను నిర్వహించారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే జరగగా, తెలంగాణలో 1.12 కోట్ల కుటుంబాలను సర్వే బృందాలు కలిశాయి. పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరగగా.. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగింది. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించటంతో బాటు 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేకు మొత్తం రూ. 161 కోట్లు వెచ్చించారు.
పెరిగిన బీసీలు
బీసీల జనాభా తగ్గించారంటూ బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాల నేతలు చేస్తున్న విమర్శలలో పస లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అని వెల్లడించారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఓసీలు-21 శాతమన్నారు. ప్రస్తుత కులగణన సర్వే ప్రకారం ఓసీలు- 15 శాతమన్నారు. తాము బీసీల జనాభాను తగ్గించామని ఆరోపిస్తున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు.
మేం రెడీ.. మీరు?
బీసీల లెక్కలు తగ్గాయని అంటున్న పార్టీలకు చెందిన వారిలో కొందరు అసలు సర్వేలోనే పాల్గొనలేదని సీఎం ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, డీకే అరుణ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు. భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ ఫ్యామిలీ సర్వేలో పాల్గొనలేదని పంచ్ లు విసిరారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్‌లో పెట్టలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీజేపీ, బీఆరెస్ పార్టీలు సైతం ఇందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
అక్బర్ వర్సెస్ సీఎం
తెలంగాణ కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్, ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలాయి. కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చకు పెట్టడం లేదని సీఎంను అక్బర్ ప్రశ్నించగా, దానికి సీఎం బదులిస్తూ.. నివేదికను బయటపెట్టేందుకు తమకు అభ్యంతరం లేదని, ప్రజల సమాచారానికి సంబంధించిన డేటా ఉన్నందున బయటపెట్టట్లేదని, దీన్ని బయటపెడితే లీగల్‌గా సమస్యలు వస్తాయని వివరించారు.
ఎస్సీ వర్గీకరణకూ ఓకే
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ తెలంగాణలో ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా గుర్తించింది. గ్రూప్ 1లో సంచార జాతులను, గ్రూప్ 2లో మాదిగ, మాదిగ ఉపకులాలను, గ్రూప్ 3లో మాల, మాల ఉపకులాలను చేర్చిందని, మొత్తం 15 శాతంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్‌లను ఆ మూడు గ్రూపులకు పంచిందని తెలిపారు. గ్రూప్-1లోని 15 ఉప కులాలు(3.288 శాతం జనాభా)కు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉప కులాలకు(వీరి జనాభా 62.748 శాతం) 9 శాతం రిజర్వేషన్లు, గ్రూప్-3 లోని 26 ఉప కులాలకు (33.96 శాతం) 5 శాతం రిజర్వేషన్‌ను ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసినట్లు సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణను తామే అమలు చేస్తామని మరోసారి సీఎం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉన్నందున, త్వరలో దీనిని కేంద్రానికి పంపుతామని సీఎం ప్రకటించారు.