Telangana Floods : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్ని మిగిలిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి వందల మంది నిరాశ్రయులవ్వగా.. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వరదల కారణంగా ఇప్పటి వారకు 23 మంది మృతి చెందగా.. మరో 9 మంది గల్లంతు అయ్యారని సమాచారం అందుతుంది. కాగా కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో ఒక్క ములుగు జిల్లాలోనే మరో 14 మృతదేహాలను వెలికితీయడంతో జిల్లా వ్యాప్తంగా మరింత విషాదం నెలకొంది.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు మరిన్ని మృతదేహాలు లభ్యమవుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ములుగు జిల్లాలోని 14 మంది మృతుల్లో.. ఎనిమిది మంది కొండాయి గ్రామస్తులే ఉండడం శోచనీయం. ఎనిమిది మంది గ్రామస్తులు కొట్టుకుపోయిన కొండాయిలో సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశామని, శుక్రవారం మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఏటూరునాగారం ఎఎస్పీ ఎస్ సంకీత్ తెలిపారు.
వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ములుగులోని ఇతర గ్రామాలలో మల్యాల, దొడ్ల ఉన్నాయి. ఈ గ్రామాలనుంచి నివాసితులను పడవల ద్వారా ఖాళీ చేయించారు. నిరాశ్రయులైన గ్రామస్తుల కోసం ఐఏఎఫ్ హెలికాప్టర్లతో 600 కిలోల అత్యవసర సామాగ్రిని విడిచారు. అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గ్రామస్తులను ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు తరలించారు.