Talasani Srinivas Yadav To Hold Meeting With GHMC Corporators: జీహెచ్ఎంసీ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం దాఖలు కావొచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పాలక మండలి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. నెంబర్ గేమ్ ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
బలంగా బీసీ ఉద్యమం..
బీసీ ఉద్యమం తెలంగాణలో బలంగా ఉందని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్వహించిన సర్వే ప్రకారం బీసీల జనాభా 51శాతంగా ఉందన్నారు. మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిపి 90శాతం జనాభా ఉన్నారని వివరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీల స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలు ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పునర్విభజన జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతాయని తెలిపారు.
బీసీ సంఘాలతో కలిసి పోరాటం..
ప్రభుత్వం కులగణనపై రీసర్వే చేపడితే, కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు తర్వాతే రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.