Hyderabad: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే నేడు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన కొంత సేపటికే ఇటు తెరాస అటు భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదాల పర్వం కొనసాగింది. కాగా కొద్ది సమయం తర్వాత ఈటల రాజేందర్ ను సభాపతి అసెంబ్లీ సెషన్ల నుండి సస్పెండ్ చేశారు.
సభ ప్రారంభమవ్వగానే, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంశాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. స్పీకర్ పోచారం పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ సభలో ఉండి చర్చ సాగించాలని మేము కోరుకుంటున్నామన్నారు. దీనిపై ఈటల అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆయన్ను సస్పెండ్ చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దానితో సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
శాసనసభ నుంచి బయటకు వచ్చిన భాజపా ఎమ్మెల్యే ఈటల, తన కారులో వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల వాహనంలో ఈటలను అక్కడ నుంచి పంపించారు.
ఇదీ చదవండి: మునుగోడులో ముప్పు తిప్పలు పడుతున్న పాల్వాయి స్రవంతి