Supreme Court orders Telangana to submit plan to Restore 100 acres of Land: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంపై సుప్రీం కోర్టులో నేడు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రుత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సుప్రీకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించారా..? లేదా..? అనేది స్పష్టం చేయాలని తెలిపింది.
ఆ మార్గదర్శకాలను విస్మరిస్తే ఊరుకోం
ఈ మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధమంగా వ్యవహరించినా ఊరుకోబోమని జస్టీస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని అనుమతులతోనే చెట్లు కొట్టేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉం దని, దాని ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ అత్యున్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేసినట్టు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
రూ. 10వేల కోట్లకు మార్టిగేజ్
అయితే రూ. 10వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూములను మార్టిగేజ్ చేశారా? అమ్ముకున్నారా? అనేది తమకు అవసరం లేదన్నారు జస్టిస్ గవాయ్. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా? లేదా? అనేది మాత్రమే తమకు ముఖ్యమని, 2004 నుంచి ఈ భూముల వ్యవహారంలో కోర్టులో ఉన్న పరిస్థితి ఆ తర్వాత చుట్టుపక్క జరిగిన అభివ్రద్ధి తదితర అంశాలను మను సంఘ్వీ వివరించారు. ఇక 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించిన ఊరుకోబోం. అయినా మూడు రోజుల సెలవు రోజుల్లో అత్యవసరంగా బుల్డోజర్‌ను దింపడానికి తొందర ఏమిటి? అని ప్రశ్నించింది.
పర్యవరణాన్ని కాపాడటమే మా పని: సుప్రీం కోర్టు
పర్యవరణాన్ని కాపాడటానికే తాము ఇక్కడ ఉన్నామని, చెట్లను ఎలా పునరుద్దరిస్తారో చెప్పాలని ఆదేశించింది. 100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని ధర్మాసనం ఆదేశించింది. పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంతకాలంలో చేస్తారు.. జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతర తదుపరి విచారణను మే 15కు కోర్టు వాయిదా వేసింది.