Site icon Prime9

Suicide : గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య.. తీవ్ర ఉద్రిక్తతగా పరిస్థితి

student suicide for postponing group 2 exams in telangana

student suicide for postponing group 2 exams in telangana

Suicide : గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గల ఒక హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు. అయితే నవంబరు 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ప్రవళిక నిన్న సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తోటి విద్యార్ధుల సమాచారంతో హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకోవడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అప్పులు చేసి మరీ చదివిస్తుంటే.. ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి తమ జీవితాలతో ఆడుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు.

పదేళ్లు గడుస్తున్నా గ్రూప్‌ పరీక్షలు నిర్వహించకపోగా ఇప్పుడు మరోసారి పరీక్షలను వాయిదా వేయడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్, పలువురు నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని వారి నిరసనకు మద్దతు తెలిపారు. మృతదేహాన్ని తరలించడం సాధ్యం కాకపోవడంతో అర్ధరాత్రి వరకు హాస్టల్‌లోనే ఉంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది. చివరికి అర్ధరాత్రి తర్వాత అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version