Site icon Prime9

Street Dogs: హైదరాబాద్ లో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన వీధికుక్కలు

street dogs

street dogs

Street Dogs: హైదరాబాద్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆడుకోవడానికి బయటకి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయింది. తండ్రి, అక్కతో కలిసి బయటకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వీధికుక్కలు విచక్షణరహితంగా దాడి చేయడంతో.. బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన అంబర్‌ పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కుక్కలను చూసి భయపడిన బాలుడు.. (Street Dogs)

విచక్షణ రహితంగా దాడి చేసిన కుక్కలు.. బాలుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్‌.. ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అంబర్ పేట్ పరిధిలోని ఓ కార్ సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో.. కుమార్తె, కమారుడిని తాను పనిచేస్తున్న సర్వీస్‌ సెంటర్‌ కి తీసుకెళ్లాడు. కుమార్తెను అక్కడే ఉంచి.. కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తండ్రి తీసుకెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న కుమారుడు.. అక్క కోసం క్యాబిన్‌ వైపు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలు పరుగెత్తుకు రావడంతో భయపడిన బాలుడు పరుగులు తీశాడు. చిన్నారిని వదలకుండా కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. బలంగా కాళ్లు, చేతులను లాగడంతో తీవ్ర గాయాలయ్యాయి.

సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు..

కుక్కల దాడిని గమనించిన అక్క.. పరుగెత్తుకు వెళ్లి తండ్రికి సమాచారం ఇచ్చింది. గంగాధర్ హుటాహుటిన వచ్చి కుక్కలను తరిమికొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని వెంటనేప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుక్కలు దాడి చేసిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూస్తుంటే.. ఓళ్లు జలదరిస్తోంది.

వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందించిన కేటీఆర్‌

బాలుడి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. నగరంలో కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని కేటీఆర్ సూచించారు. నగరంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని.. వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Exit mobile version