Sathvik Suicide: శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. కాగా ఆత్మహత్యపై ఎంక్వైరీ కమిటీ రిపోర్టును ఇచ్చింది. ఇందులో అధికారులు ఏమన్నారంటే?
పాత విషయాల ప్రస్తావన.. (Sathvik Suicide)
సాత్విక్ ఆత్మహత్య రిపోర్ట్ లో పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. ఈ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. ఈ రిపోర్టులో భాగంగా.. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ పేర్కొంది. ఒక కాలేజీలో అడ్మిషన్ ఉండగా.. మరో కాలేజీలో క్లాసులు వింటున్నాడని రిపోర్టులో స్పష్టం చేసింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే తంతు నడుస్తోందని విచారణ కమిటీ పేర్కొంది. క్లాసులేమో శ్రీచైతన్యలో.. చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్లపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది.
ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం..
ఈ ఆత్మహత్యపై విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాత్విక్ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను రూపొందించారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై సాత్విక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య కలకలం రేపింది. సాత్విక్ మృతి చెందడంపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అప్పటినుంచి సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు సాత్విక్ తల్లిదండ్రులు తెలిపారు. కాలేజి సిబ్బంది స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు. అబ్బాయి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని తోటి విద్యార్ధులు ఆరోపించారు. సాత్విక్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు.
సూసైడ్ నోట్ లో నలుగురి పేర్లు..
అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కాలేజీ ప్రిన్సిపల్, కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులను తట్టుకోలేకపోయాను. ఈ నలుగురు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారుని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ నలుగురి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. క్షమించు అమ్మా.. నేను పడిన టార్చర్ ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నా. నన్ను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నాడు. అమ్మా నాన్న లవ్ యూ.. మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సాత్విక్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ మాటలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.