Road Accident : మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూటీ పై నలుగురు వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ సమయంలోనే గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందిడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక మరొకరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఒక స్కూటీపై అంత మంది వెళ్లడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లే తీవ్ర విషాదానికి దారి తీస్తాయని.. ప్రజలు అటువంటి పొరపాట్లు చేయకుండా భద్రత పాటించి రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లాలని కోరుతున్నారు.
ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌లోని రాంనగర్‌కు చెందిన మలైకా సుల్తానా స్కూటీపై ఇద్దరు బాలికలు, ఓ బాలుడిని తీసుకుని మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని మనోహరాబాద్ మండలం కల్లకల్ వద్ద స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వారంతా కింద పడగా.. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపైనుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మలైకా సుల్తానాతో పాటు ఓ బాలిక, బాలుడు మృతిచెందారు.
అయితే మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.