Revanth Reddy:బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఆలయాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు.
వేములవాడకు తీరని అన్యాయం.. (Revanth Reddy)
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు సంధించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం మరిచిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేసినట్లే.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తో కలిసి వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా రాజన్న ఆలయం ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు. రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారో.. అలాగే వేములవాడ రాజన్నను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఇక.. మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని మండిపడ్డారాయన. అలాగే.. కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ డిమాండ్ చేశారు.
గిరిజనులను ఆదుకోవాలి..
పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా?. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు గురించి ప్రస్తావిస్తూ.. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడినే గెలిపించాలని, కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని వేములవాడ వాసులను కోరారాయన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేములవాడ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.