Site icon Prime9

Revanth Reddy Comments: ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

revanth reddy tour

revanth reddy tour

Revanth Reddy Comments: ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఈడీ తలచుకుంటే కవితని గంటలో అరెస్ట్ చేసి జైలుకు పంపొచ్చని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈడీ తలచుకుంటే కవితన జైలుకు పంపొచ్చు..

జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణలో ఈడీ తలచుకుంటే.. కవితను గంటలో అరెస్ట్ చేసి జైలుకి పంపవచ్చని అన్నారు. అలా చేయకుండా కేవలం పబ్లిసిటీ కోసమే.. బీజేపీ- బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని ఆరోపించారు. ఈ గేమ్ మెుత్తం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో సాగుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితని జైల్లో వేయడానికి ఇంత సేపా? కవితను ఏమైనా పేరంటానికి పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కీలక నేతల దగ్గర లక్షల కోట్ల సంపద ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత, సంతోష్, హరీశ్ రావు, కేటీఆర్‌ ల వద్ద లెక్కలేనన్నీ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తే.. సీఎం కేసీఆర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తాడని అన్నారు. బీఆర్ఎస్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను, అదానిపై హిండెన్ బర్గ్ నివేదికను పక్కదారి పట్టించేందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నారని వెల్లడించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు.. (Revanth Reddy Comments)

ఈడీ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కవితపై పలు ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కలిసి రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నాయని ఆరోపించారు. కవిత లిక్కర్‌ స్కాం పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. ఎందుకు ఎలాంటి విషయాల్ని బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ పట్ల వ్యవహరించినట్లుగా.. కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ.. బీజేపీ జేబు సంస్థలుగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని తాటికొండ రాజయ్యను మంత్రి మండలి నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు కవిత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్‌ మౌనపాత్ర పోషిస్తుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు ఎందుకు విచారణ చేపట్టలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని చివరికి ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చెప్తున్నా.. ఎందుకు విచారణ ఎందుకు జరిపించడం లేదో చెప్పాలన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి టీవీల ముందు పేపర్ పులుల్లా రంకలేయడం కాదని.. వీటన్నింటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version