Site icon Prime9

Lb Nagar Police Station : ఎల్‌బీ నగర్‌ పోలీస్ స్టేషన్ లో మహిళపై థర్డ్‌ డిగ్రీ, చిత్ర హింసలు..

police 3rd degree on woman at lb nagar police station

police 3rd degree on woman at lb nagar police station

Lb Nagar Police Station : హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌‌కు తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకాం.. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది. ఈమె కూతురు పూజకు తిరుమలగిరికి చెందిన కుమార్ నాయక్ తో పెళ్ళి కుదిరింది. ఈ నెల 30న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా పెళ్లిపనులు చూసుకుంటోంది లక్ష్మి. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూతురు పెళ్లికి డబ్బులకోసం సరూర్ నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లింది లక్ష్మి. డబ్బులు తీసుకుని రాత్రి ఒంటరిగా ఇంటికి బయలుదేరిన ఆమెను ఎల్బీ నగర్ సర్కిల్ లో పోలీసులు ఆపారు.

కాగా కారణం చెప్పకుండానే తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.. రాత్రంతా స్టేషన్ లోనే వుంచి చిత్రహింసలకు గురిచేసారని బాధితురాలు వాపోయింది. బూతులు తిడుతూ లాఠీలతో చితకబాదారని.. అంతటితో ఆగకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధితురాలు చెబుతోంది. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచి.. ఉదయం విడిచిపెట్టారని తెలిపింది. పోలీసుల దెబ్బలతో నడవలేని స్థితిలో ఆమె ఎలాగోలా ఇంటికి చేరుకోగా.. స్టేషన్ లో జరిగిన విషయం బయటపెడితే నీ సంగతి చూస్తామని బెదిరించడంతో భయపడి విషయం బయటపెట్టలేదని కన్నీరు పెట్టుకుంది. కానీ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో విషయాన్ని బయటపెట్టినట్లు వెల్లడించింది.

అయితే పోలీస్ దెబ్బలతో లక్ష్మి కాళ్లు నల్లగా కమిలిపోయాయని.. శరీరంపై అనేక చోట్ల గాయాలున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. పోలీసులు తనతో చాలా అవమానకరంగా ప్రవర్తించారని.. ఎక్కడపడితే అక్కడ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళను రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉంచడమే తప్పయితే.. ఆమెపై థర్డ్ డిగ్రీ కూడా ప్రదర్శించిన ఎల్బీ నగర్ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు కోరుతున్నారు.

తాజాగా ఈ ఆరోపణలకు సంబంధించి రాచకొండ పోలీసు కమిషనర్ సీపీ చౌహాన్ స్పందించారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఓ మహిళపై పోలీసులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Exit mobile version