Ministry of Jal Shakti: మిషన్ భగీరధకు అవార్డు ఇవ్వలేదు.. కేంద్ర జలశక్తి శాఖ

తెలంగాణకు వచ్చి తిడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 05:05 PM IST

New Delhi: తెలంగాణకు వచ్చి తిడుతున్నారు. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడ అదే తెలిపింది.

కేంద్ర జలశక్తి శాఖ మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడాన్ని ఖండించింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణకు అవార్డుకు ఎంపికైందని తన వివరణలో జలశక్తి శాఖ తెలిపింది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని, తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక ఇచ్చిందని కానీ, కేంద్రం ధృవీకరించలేదన్నారు. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలి. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8% నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయి. అదేవిధంగా మొత్త నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత JJM నిబంధనల ప్రకారం లేదని గుర్తించామని తెలిపింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో అక్టోబరు 2న తెలంగాణకు అవార్డును బహూకరిస్తున్నారు.