Neera Cafe: హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేసిన ‘నీరా కేఫ్’ను తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల వ్యయంతో ఈ కేఫ్ ను ఏర్పాటు చేసింది. అచ్చం పల్లెలో ఉన్నట్టుగా పచ్చని వాతావరణంలో ఈ కేఫ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ప్రచారం ఉందని.. కానీ ఇది వేదామృతమని చెప్పారు. ‘నీరా బహుళ పోషకాల గని. గీత వృత్తి తరతరాలుగా వస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేఫ్ లేదు. ఇది ఆత్మ గౌరవానికి ప్రతీక’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. అనంతరం తెలంగాణ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నీరాను సేవించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన పలువురు స్వామీజీలు పాల్గొన్నారు.
నీరా కేఫ్ ప్రత్యేకతలివే..(Neera Cafe)
2020 జులై 23న నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది.
ఈ కేఫ్ ను రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో నీరా అమ్ముతారు.
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ధి చేసి ఈ కేఫ్ లో ఇక్కడ విక్రయిస్తారు. నీరాతో తయారు చేసిన ఉప ఉత్పత్తులూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇక్కడ మొత్తం ఏడు స్టాళ్లు ఉంటాయి. ఒకే సారి 300 నుంచి 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
పల్లెల్లో తాటి, ఈత చెట్ల మధ్య కూర్చున్న అనుభూతి వచ్చేలా నిర్మించారు.
కేఫ్ చుట్టూ తాటి చెట్ల లాంటి ఆకృతులు, పైకప్పును కూడా తాటాకు ఆకృతిలో రూపొందించారు.
కేఫ్ నుంచి బోటింగ్..
ఈ కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకూ బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.
ఇక్కడి ఉత్పత్తులకు టేక్ అవే సౌకర్యమూ ఉంది.
నగర శివారులోని నందన వనంలో పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
అదే విధంగా సురక్షిత పద్ధతుల్లో ప్యాకింగ్ చేస్తారు. నాలుగు డిగ్రీల వద్ద నీరా సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించిన తర్వాత దాన్ని సీసాల్లో పోసి, ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు.
తర్వాత ప్రత్యేక యంత్రాల ద్వారా వడపోసి శుద్ధి చేస్తారు. ఆ తర్వాత సురక్షిత పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు.