Site icon Prime9

Tourist Rescue : 82 మంది ప‌ర్యాట‌కులు సేఫ్.. ఫలించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాల కృషి

muthyaladhara water fall tourists rescued successfully

muthyaladhara water fall tourists rescued successfully

Tourist Rescue : ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లంలోని ముత్యాల‌ధార జ‌ల‌పాతం వద్ద సంద‌ర్శ‌న‌కు వెళ్లి పలువురు పర్యాటకులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిని సురక్షితంగా కాపాడేందుకు రంగం లోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ప‌ర్యాట‌కులను సుర‌క్షితంగా కాపడారు. బుధ‌వారం అర్థ‌రాత్రి త‌రువాత అడ‌విలో చిక్కుకున్న 82 మంది ప‌ర్యాట‌కుల‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

అయితే వీరంతా ముత్యాల‌ధార జ‌ల‌పాతం చూసేందుకు వెళ్ళగా.. భారీ వ‌ర్షం కార‌ణంగా తిరుగు ప్ర‌యాణంలో వాగు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ప‌ర్యాట‌కులు అడ‌విలోనే చిక్కుకుపోయారు. వీరంతా అడ‌విలో చిక్కుకుపోయిన విష‌యం బుధ‌వారం రాత్రి వెలుగ‌లోకి వ‌చ్చింది. అధికారుల‌కు స‌మాచారం అందిన వెంట‌నే మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆదేశాల మేర‌కు పోలీసు ఉన్న‌తాధికారులు, ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలను సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించారు.

కాగా వీరిలో క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన తిరుమ‌ల్ డ‌య‌ల్ తాము అడ‌విలో చిక్కుకుపోయిన‌ట్లు స‌మాచారం ఇచ్చాడు. అయితే స్థానిక పోలీసులు, అధికారులు ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నం చేయ‌గా భారీ వ‌ర్షం కార‌ణంగా ఆ ప్రాంతానికి చేరుకోవ‌టం క‌ష్ట‌త‌రంగా మారింది. దీంతో ములుగు క‌లెక్ట‌ర్‌, ఎస్పీలు అడ‌విలో చిక్కుకుపోయిన‌ ప‌ర్యాట‌కుల‌తో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎత్తైన ప్ర‌దేశంలో ఉండాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో వాగు దాటేందుకు ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించేందుకు ఏటూరునాగారం నుంచి ఎన్డీఆర్ఎఫ్, జిల్లా డిజాస్ట‌ర్ రెస్సాన్స్ ఫోర్స్ (డీడీఆర్ఎఫ్‌) బృందాలు నాలుగు బ‌స్సుల్లో ఆహారం, తాగునీటిని తీసుకొని బుధ‌వారం అర్థ‌రాత్రి ప‌ర్యాట‌కులు చిక్కుకుపోయిన ప్రాంతానికి బ‌య‌లుదేరారు. రాత్రి 11 గంట‌ల‌కు వీర‌భ‌ద్ర‌వ‌రం చేరుకొని, అక్క‌డి నుంచి ఎనిమిది కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క‌న జ‌ల‌పాం వ‌ద్ద‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఆ తర్వాత వారిని సుర‌క్షితంగా అట‌వీ ప్రాంతం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

Exit mobile version
Skip to toolbar