Site icon Prime9

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం.. సీనియర్లు x రేవంత్ రెడ్డి

TPCC

TPCC

Hyderabad : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం మొదలయింది. పీసీసీ కమిటీలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నేరుగా రేవంత్ రెడ్డి పై పలువురు సీనియర్ నాయకులు చేసిన విమర్శలతో వలస వచ్చిన 13 మంది నేతలు పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. వారి రాజీనామా లేఖను టీ కాంగ్రెస్ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు పంపారు. రాజీనామా చేసినవారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్.. తదితరులు ఉన్నారు.

టార్గెట్ రేవంత్ రెడ్డి…

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుండి సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. అయితే బహిరంగంగా బయటపడింది మాత్రం అతి కొద్ది మందే. వారిలో కొందరు పార్టీ వీడిపోయారు. కొంత మంది పార్టీలో ఉన్నా లేనట్లే ఉన్నారు. అయితే పీసీసీ కమిటీలు ప్రకటింటిన తర్వాత అసంతృప్తి వాదులంతా ఒక్క సారిగా బయటకు వచ్చారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ , మహేశ్వర్ రెడ్డి , కోదండరెడ్డి ఇలాంటి సీనియర్లంతా బయటకు వచ్చారు. తాము ఎప్పట్నుంచో కాంగ్రెస్‌లో ఉన్నామని తమపై కోవర్టుల ముద్ర వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక రేవంత్ పిలుపునిచ్చే కార్యక్రమాలకు వెళ్లకూడదని డిసైడ్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ హై కమాండ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని వారు అంటున్నారు.కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు పరిణామాలు చాలా బాధిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంతమందిని అవమానించడానికే డీసీసీల ప్రకటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత కమిటీల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో 50 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

రేవంత్ కౌంటర్ పాలిటిక్స్…

మరోవైపు సీనియర్లకు రేవంత్ రెడ్డి కూడ తనదైన తరహాలో కౌంటర్ ఇవ్వబోతున్నారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నవారిలో ఎంతమంది యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారో ముఖ్యంగా గత ఎనమిదేళ్లుగా వీరి పనితీరుపైన హైకమాండ్ కు నివేదిక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. టీపీసీ అధ్యక్షుడిగా తాను రాకముందు. వచ్చిన తరువాత పార్టీ పరిస్దితిని అంచనా వేయాలని ఆయన కోరుతున్నారు. సీఎం కేసీఆర్ ను నేరుగా ఢీకొట్టే నేతను తానేనని సీనియర్ల ముసుగులో వీరంతా విశ్రాంతి రాజకీయాలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. పార్టీకి ప్రజల్లో ఆదరణ పెంచడానికి, శ్రేణులను ఏకం చేయడానికి తాను పాదయాత్ర చేస్తానని సంకేతాలు కూడ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి జనవరి 26నుంచి పాదయాత్ర ప్రారంభించి 5 నెలలపాటు కొనసాగిస్తారని చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో సీనియర్లు ఏకంగా పీసీసీ అధ్యక్షుడినే టార్గెట్ చేయడం, వలసనేతల రాజీనామాల నేపధ్యంలో మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version