Narsingi: హైదరాబాద్ లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడిలు, అత్యాచారలు నానాటికి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన దారుణ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి.. అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు.
నార్సింగిలో ఘటన..(Narsingi)
హైదరాబాద్ నార్సింగిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ సిబ్బంది మృతి చెందాడు. అయితే ఈ దాడికి పాల్పడిన దుండగులకు నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మృతి చెందిన సంజయ్ అనే యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడ లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో పెట్రోల్ బంక్ కు వచ్చిన ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో ఆ సిబ్బంది.. పెట్రోల్ పోశారు. ఆ తర్వాత కార్డు పనిచేయట్లేదని యువకులు దాటావేశారు. దీంతో నగదు ఇవ్వమనడంతో.. ఆ యువకులు గొడవకు దిగారు.
నార్సింగి జన్వాడ HP పెట్రోల్ పంపులో పంప్ బాయ్‌పై దాడి చేసిన ముగ్గురు యువకులు.. యువకుడు మృతి
స్వైపింగ్ మిషన్ పని చేయడం లేదు క్యాష్ ఇవ్వమని అడిగితే కొట్టిన యువకులు. కుప్ప కూలిన పంపు బాయ్ సంజయ్. ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి.#Narsingi #Hyderabad pic.twitter.com/YOnxaaRFmQ
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2023
రెచ్చిపోయిన నిందితులు..
నగదు ఇవ్వాల్సిందిగా పెట్రోల్ బంక్ సిబ్బంది కోరడంతో.. ఆ యువకులు మరింతగా రెచ్చిపోయారు. మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ రెచ్చిపోయి దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. సంజయ్ పై ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. ఇది గమనించిన యువకులు మద్యం మత్తులో అక్కడి నుంచి పారిపోయారు. సంజయ్ ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీ కెమెరాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు..
సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో నిర్వహించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్‌గా గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.