Hyderabad: రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 22వ తేదీన ఉదయానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత క్రమంగా ఇది బలపడుతూ 48గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడుతాయని ఐఎండీ సంచాలకులు సూచించారు. కావున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పేర్కొన్నారు.