Site icon Prime9

Telangana: నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడ్డింది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులు, గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, హన్మకొండ, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

అల్పపీడన ప్రభావం అటు ఏపీలోనూ తీవ్రంగా ఉంది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జిల్లాల్లో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని, కురుపాం, సీతంపేట, వీరఘట్ట, పాలకొండ తదితర మండలాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. విజయనగరం, బబ్బిలి, తదితర మండలాల్లో చెదురుమదురుగా జల్లులు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

Exit mobile version