MLC kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల మీద చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
కానీ, తనకు అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత తెలిపారు. దీంతో, ఈడీ కవితకు మళ్లీ నోటీసులు పంపించింది.
మరోసారి నోటీసులు(MLC Kavitha)
ఈ నెల 20వ తేదీన కవిత విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. దీంతో, ఈడీ నోటీసులపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈనెల 24 వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత అనుకోని ట్విస్ట్ ఇచ్చారు.
ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు.
ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు.
ఈ మేరకు ఈడీకి కవిత 6 పేజీల లేఖ రాశారు.
ఈడీ వేధిస్తోంది: కవిత లాయర్(MLC Kavitha)
ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు అన్యాయంగా కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది భరత్ అన్నారు.
అనారోగ్యం అని అసత్యప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు.
విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో ఈడీ చెప్పలేదన్నారు.
కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుందన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టంచేశారు.
విచారణ వాయిదా వేయండి
‘కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి.
ఒక మహిళను ఈడీ ఆఫీస్‌కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది.
చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే నాకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటాను.
నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా నా బ్యాంక్ స్టేట్మెంట్ సహా మీరు అడిగిన పత్రాలు పంపుతున్నాను.’ అని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.