MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. అయితే కవిత నేడు హాజరు అవుతారా.. లేదా తన తరపున న్యాయవాదిని పంపిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అందరిలో ఒకటే ఉత్కంఠ..
సోమవారం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరువుతారా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 16న జరగాల్సిన ఈడీ విచారణకు కవిత వెళ్లలేదు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. కవిత తరపున న్యాయవాది ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు పంపించారు. తన విచారణపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై 24న విచారణ జరగనుంది. అప్పటిదాకా ఈడీ విచారణ ఆపాలని అధికారులకు కవిత లేఖ రాశారు. అయినా కూడా 20న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు ఇవ్వడం నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
తిరస్కరించిన కోర్టు.. (MLC Kavitha)
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న కవిత విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈడీ విచారణకు కవిత హాజరైతే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఈ క్రమంలో మరి కవిత విచారణకు హాజరవుతారా? లేదా తన న్యాయవాదిని పంపుతారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీకి చేరుకున్న కవిత
సోమవారం విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కవిత వెంట ఆమె భర్త అనిల్‌తోపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, కొందరు సన్నిహిత అనుచరులు ఉన్నట్టు సమాచారం.
అధికారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందే కవిత ఢిల్లీకి చేరుకున్నా.. విచారణకు హాజరయ్యే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
న్యాయ నిపుణుల సలహాలకు అనుగుణంగానే నడుచుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రతీసారి ఊహాగానాలతో..
ఈడీ నోటీసుల నేపథ్యంలో విచారణకు వెళ్లిన ప్రతిసారీ కవిత అరెస్టు అవ్వచ్చొనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సహా మంత్రులు రావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుంది.
ఇక ఈడీ విచారణకు హాజరుకాని పక్షంలో ఎదురయ్యే పరిణామాలపై కవిత ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
నిబంధనల మేరకు విచారణ జరగడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అదే వాదనకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారని తెలిసింది.