Vanaparthi: రక్తపు కూడుతో తిని పెరిగిన చరిత్ర మీది, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 22 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఉద్యమకారుడిని నేను అంటూ వైఎస్ షర్మిల పై తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
గోపాల్ పేట మండల పరిధిలోని లబ్దిదారులకు ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన షర్మిల పై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే ఒక్క మాటకు వంద మాటలు అనే సత్తా తనకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బిడ్డవైతే జరగనున్న మునుగోడు ఎన్నికల్లో నిలబడాలని మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలకు సవాల్ విసిరారు.
వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే తాను న్యాయవాదిగా పన్ను కట్టిన చరిత్ర తనకుందన్న మంత్రి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని చెప్పుకొచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చిన ఘనత తనకుందని తెలుసుకోవాలని షర్మిలకు ఆయన గీతోపదేశం చేసాడు. అహకారంతో తెలంగాణాలో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషించడం తగదన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజును షర్మిల అవహేళన చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు.