Metro Train: హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేస్తున్న భాగ్యనగర మెట్రో సేవలు ఇప్పుడు మరింత విస్తృతం కానున్నాయి. నగరంలో మరో మార్గంలోనూ మెట్రో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో మూడు ప్రధాన మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను ఇప్పుడు పాత బస్తీ వరకు విస్తరించనున్నారు. ఈమేరకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనితో ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని ఎల్ అండ్ టీ సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
మెట్రో కారిడార్-2లో పనుల్లో భాగమైన ఎంజీబీఎస్-ఫలక్‌నుమా రూట్‌కు గతంలోనే అధికారులు సర్వే పూర్తి చేశారు. మొత్తం 16 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ఇప్పటికే ఎంజీబీఎస్- జేబీఎస్ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చింది. కాగా మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా తక్షణమే పూర్తి చేయాలని ఎల్ అండ్ టీ సంస్థ అధికారులను సీఎం కేసీఆర్ కోరారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని తాము తెలిపినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇక కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని, పాత బస్తీ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పాతబస్తీ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. కాగా ఈ మార్గంలో నాలుగు స్టేషన్లను ప్రతిపాదించారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్ వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
Welcome this announcement by @KTRBRS. The people of Hyderabad’s Old City have been waiting for public transport connectivity for a long time. This will definitely help people of Old City & also bring in more tourism. https://t.co/BK3Cr6WwNX
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2023