Telangana Formation Day 2023: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల కోసం రాష్ట్రమంతా ముస్తాబవుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 2న రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడకులకు ముఖ్య అతిథిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరుకానున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కీలకపాత్ర పోషించారు. 2014లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడంలో ఆమె చేసిన కృషి అనిర్వచనీయమంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కొనియాడుతున్నారు.
మీరాకుమార్ కీలకపాత్ర(Telangana Formation Day 2023)
ఇకపోతే మీరాకుమార్ స్వయంగా దివంగత దళితనేత, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తె. అలాగే మీరాకుమార్‌ను ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. ఎందుకంటే సీమాంధ్రకి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పుడు ఆమె ఎంతో సాహసోపేతంగా బిల్లు ఆమోదింపబడేలా చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంలో మీరాకుమార్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు జూన్ 2న జరిగే 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించనున్నారు.
ఇకపోతే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా ఏటా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరమంతా ఈ మేరకు గులాబీ గుబాలింపు అలముకుంటుంది. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు చేస్తారు.