Site icon Prime9

Ktr On ED Notice: అదానీ చేసేవీ స్కామ్ లు కావా..? విచారణను ఎదుర్కొనే దమ్ముంది

Ktr On ED Notice

Ktr On ED Notice

Ktr On ED Notice: బీజేపీ ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తన సోదరి కవితకు ఈడీ నోటీసులు పంపడంపై ఆయన స్పందించారు.

బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని.. మోదీ చేతిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కీలుబొమ్మ.. సీబీఐ తోలు బొమ్మగా మారిందని కేటీఆర్ విమర్శించారు.

 

విచారణను ఎదుర్కొనే దమ్ముంది(Ktr On ED Notice)

‘దేశంలో జుమ్లా.. లేదంటే హమ్లా అన్నట్లు మోదీ సర్కార్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇపుడు బీఆర్‌ఎస్‌పై ఉసిగొల్పుతున్నారు.

మా ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు అందాయి. కానీ, అవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. అయితే మోదీ సమన్లకు ఎవరూ భయపడరు.

దేశంలో ఏదో జరుగుతుందంటూ కేంద్రప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.

కవిత తప్పకుండా విచారణకు వెళ్తుంది. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకుంది. ఎమ్మెల్యేలను కొనబోయి స్టే తెచ్చుకున్న బీఎల్‌ సంతోష్‌లాగా కాదు మేము.

న్యాయవ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జడ్జిలలో కొంతమంది బీజేపీ వాళ్లు ఉండొచ్చు. కానీ, కొందరైనా మంచి జడ్జిలూ ఉన్నారు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఈడీ, సీబీఐ వేటకుక్కల్లాంటి సంస్థలు.. బీజేపీకి అనుబంధ సంస్థలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

కవిత కేసే మొదటిది, చివరిది కాదని.. ఇకపై కూడా తమ పార్టీ నేతలను వేధిస్తారన్నారు.

 

అదానీ చేసేవీ స్కామ్ లు కావా?

‘గౌతమ్‌ అదానీ ఎవరు అంటే.. ప్రధాని మోదీ బినామీ అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. అదానీకి అక్రమంగా పోర్టులను కట్టబెట్టారు. ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే.. ప్రధాని ఉలకడు, పలకడు.

దాదాపు రూ. 13 లక్షల కోట్లు పోయినా మోదీ, నిర్మల స్పందించలేదు. గుజరాత్‌లో ముంద్రా పోర్టులో వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడితే మోదీ నుంచి స్పందన లేదు.

ఇవి స్కామ్ లు కాదా? అయినా అదానీపై కేసులు ఉండవు. ఒక ఇంజన్‌ ప్రధాని.. మరో ఇంజన్‌ అదానీ.. ఇదే బీజేపీ డబుల్‌ ఇంజన్‌ నినాదం’ ఎద్దేవా చేశారు కేటీఆర్‌.

మోదీని వ్యతిరేకిస్తే ప్రతిపక్ష పార్టీలపై అక్రమంగా కేసులు పెడతారని కేటీఆర్ తెలిపారు. దర్యాప్తు సంస్థల నుంచి 95 శాతం దాడులు విపక్షాల మీదే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

బీజేపీ వాళ్ల మీద పెట్టిన కేసులు ఏమవుతున్నాయి? ఎందుకు నీరుగారిపోతున్నాయి? అని నిలదీశారు కేటీఆర్‌.

గత తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా?.. నీతిలేని పాలనకు మోదీ ప్రభుత్వం పర్యాయపదంగా మారిందని విమర్శించారు.

 

Exit mobile version