Site icon Prime9

KCR Comments on Congress Party: “కాంగ్రెస్‌ పూర్తికాలం అధికారంలో ఉంటేనే..” వాయిస్ మార్చిన కేసీఆర్!

KCR Sentational Comments about Congress Government

KCR Sentational Comments about Congress Government

KCR Sentational Comments on Telangana Congress Government: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ​వాయిస్ మారింది. గతంలో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలల్లో లేదా ఏడాదిలో కూలిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మాత్రమే కాదు. కేటీఆర్​, హరీష్‌రావులు సైతం అదే జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల రేవంత్‌రెడ్డి సర్కారుపై గులాబీబాస్ వాయిస్ మారడం చర్చనీయాంశంగా మారింది.

 

హ్యాట్రిక్ విజయంపై కలలు కన్న బీఆర్ఎస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గులాబీ పార్టీని మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ సర్కారు ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలలు, ఏడాదిలో కూలిపోతుందని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని కేసీఆర్​ స్వయంగా చెప్పారు. వారు తమతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కాని ఏడాదిన్నర గడిచిపోయినా ఏమీ కాలేదు.

 

అయితే, అందుకు భిన్నంగా బీఆర్​ఎస్​ నుంచే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి అనర్హతకు సంబంధించి వాదోపవాదాలు పూర్తయి సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వులో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారుపై గులాబీ బాస్ వాయిస్ మారిపోయింది. ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదంటున్నారు. మరో మూడేళ్ల వరకు అంటే ఐదేళ్ల గడువు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పేర్కొంటున్నారు. తాము ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దర్జాగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రభుత్వాన్ని కూల్చి తాను సీఎం సీట్లో కూర్చోవడాన్ని ఆయన ఎవరో వేసిన భిక్షగా కేసీఆర్ అభివర్ణించారు. వాడూ వీడూ భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోనని విచిత్రంగా చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అడిగినా ఆయన మాత్రం ఒప్పుకోరంట. మధ్యలో అధికారాన్ని తీసుకునే ప్రసక్తే లేదని, అసెంబ్లీ ఎన్నికల్లోనే తేల్చకుంటామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజలు తప్పులు తెలుసుకొని మళ్లీ బీఆర్​ఎస్‌ను గెలిపిస్తారని కేసీఆర్​ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది.

 

ఇక కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనే గట్టి నమ్మకంతో కేసీఆర్​ ఉన్నారంట. ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుస్తుందని, దీంతో కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని, మళ్లీ బీఆర్​ఎస్​ ఇమేజ్​ పెరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయతే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మరి మాజీ సీఎం ధీమా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

Exit mobile version
Skip to toolbar