Hyderabad: జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే రోజు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించే అవకాశముంది. దీనిపై ఇప్పటికే ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. దసరా రోజే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల జాతీయ పార్టీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
త్వరలోనే భారీ బహిరంగ సభకు కేసిఆర్ ప్లాన్ చేశారని, ఆసభలోనే జాతీయ పార్టీ జెండా, ఎజెండా పై కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ జెండా సైతం వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చని సమాచారం. ఎన్నికల గుర్తు విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతునాగలి గుర్తుతో పార్టీని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఐతే కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం, జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులోనే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతులతో పాటు బడుగు, బలహీనవర్గాలు సంక్షేమాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ పథకాలను జెండాలో పొందుపరచచ్చని తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ గానీ, ఇతర టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు దీని పై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
భాజపా వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. తొలిదశలో యువత, రైతులకు సంబంధించిన అంశాల పై ఉద్యమాలు రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాల పై కేసీఆర్ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాల పై ప్రశాంత్‌కిషోర్ బృందం. ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన భాజపా, కాంగ్రెస్ విఫలం కావడంవల్లే, అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదని ప్రచారం చేయనున్నారు. అందుకు గణాంకాలు, ఉదాహరణలతో పుస్తకాలు ముద్రించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా వ్యూహరచన చేస్తున్నారు.