Hyderabad: గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలు, మేధావులతో విస్తృత సమాలోచనలు జరుపుతోన్న కేసీఆర్. పార్టీని దసరా నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటనతో పాటు ప్రజల మద్దతు కూడగట్టుకోవటం లాంటి అంశాలపై పక్కా వ్యూహాలతో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు.
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ -ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయపార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, శంకర్‌సింఘ్ వాఘేలాతో సమావేశమైన కేసీఆర్, తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. మోదీని గద్దె దించే ఆవశ్యకత, జాతీయ పార్టీ ఏర్పాటుపై వారితో మాట్లాడారు. వారు కూడా కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్, అందుకు అనుగుణంగా ఆయా అంశాల పై విస్తృత సమాలోచనలు చేస్తున్నారు. మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో కేసీఆర్ నిరంతరం సమాలోచనలు జరుపుతున్నారు. అజెండా, ప్రయాణం, ప్రచారం పై ఏకాభిప్రాయానికొచ్చిన కేసీఆర్, దసరా నాటికి జాతీయ పార్టీ ప్రకటన చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీకి భారత రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ పేరు పెట్టాలా, మరో పేరు ఖరారు చేయాలా అనే అంశం పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు సమానదూరం పాటిస్తూనే, స్పష్టమైన అజెండాతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు కేసీఆర్. బీజేపీ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని భావిస్తున్న ఆయన, అదే సమయంలో కాంగ్రెస్‌పై విశ్వాసం లేకపోవటాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని గట్టిగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ మీద ఎక్కువగా స్పందించకుండా, బీజేపీ ముక్త్ భారత్ అంశంతో దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ ప్రస్తుత వ్యూహంగా తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలన్ని ఏకతాటిపైకి రావాలంటూ మొదటి నుంచి ఆకాంక్షిస్తోన్న కేసీఆర్. అందుకోసం అన్ని విధాల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలవడంతో పాటు, మరికొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించి చర్చించారు. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతోనూ చర్చించారు. కొన్ని పార్టీలు బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున, ప్రస్తుతానికి మాత్రం వాటికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకపోయినా, జేడీఎస్, ఆర్జేడీ, మరో రెండు, మూడు పార్టీలు మాత్రం కచ్చితంగా తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బాస్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
పార్టీ ప్రారంభ మొదటి దశలో రైతులు, కార్మికులు, దళితులు, యువతకు సంబంధించిన అంశాలపై పోకస్ పెట్టాలనుకుంటోనే కేసీఆర్ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ అంశాలపై ఉద్యమాలను రూపొందించేలా వ్యూహాలు రచిస్తున్నారు. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ప్రతీ సభలో నొక్కివక్కానిస్తోన్న కేసీఆర్, ఆ అంశాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని దళితులు డిమాండ్ చేసేలా ఉద్యమాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో జాతీయ స్థాయి దళిత సదస్సు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. యువత ఏఏ అంశాలపై అసంతృప్తిగా ఉందన్న దానిపై నివేదికలు తెప్పించుకున్నారు. అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానికుల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి సారించారు. వాటిపై స్థానిక ప్రజాభాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు పథన రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద పక్కా యాక్షన్ ప్లాన్‌తో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్.