JPS Regularization: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
కమిటీలు ఏం చేస్తాయంటే(JPS Regularization)
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీలు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదా శాఖాధిపతి స్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కమిటీ వేస్తారు. జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీలు పంపిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది.
ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇస్తారు. అనంతరం క్రమబద్ధీకరణ విషయం పై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. అటు రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు. ఆ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తదుపరి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కాగా, జేపీఎస్‌లు తమ ప్రొబేషన్ పూర్తయిన నేపథ్యంలో రెగ్యూలరైజ్ చేయాలని ఈ మధ్య సమ్మె చేపట్టారు. అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జేపీఎస్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.