Hyderabad: గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు. ఈ మళ్లింపు ఈ నెల 13 నుంచి ఆగష్టు 10 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఈ ట్రాఫిక్ అలెర్ట్ను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.
జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో శిల్పాలే అవుట్ ఫ్లైఓవర్ రెండోదశ నిర్మాణ పనులు జరుగుతన్న నేపథ్యంతో గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని 90 రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని కోరారు. అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులిలా..(Hyderabad)
గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వైపు నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ వద్ద దారి మళ్లించి.. మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ హాస్పిటల్, క్యూ మార్ట్, కొత్తగూడ పై వంతెన మీదుగా వెళ్లాలి.
టెలికాంనగర్ నుంచి కొండాపూర్‌కు వచ్చేందుకు గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని శిల్పా లేఅవుట్ పై వంతెన నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్, కొత్తగూడ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపుకు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్, కొత్తగూడ మీదుగా మళ్లిస్తారు.
నానక్‌రాంగూడ విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ చౌరస్తా వైపుకు వచ్చే వాహనదారులు ట్రిపుల్ ఐటీ కూడలి దగ్గర ఎడమ వైపు వెళ్లి.. గచ్చిబౌలి స్టేడియం ముందు యూటర్న్ తీసుకుని డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్, కొండాపూర్ మీదుగా ఆల్విన్ కాలనీ వైపు వెళ్లాలి.
టోలిచౌకి ప్రాంతం నుంచి ఆల్విన్ చౌరస్తాకు వచ్చే వెహికల్స్ ను రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు కూడలి నుంచి మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్ జంక్షన్ మీదుగా కొత్తగూడ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఆల్విన్ కాలనీ నుంచి లింగంపల్లికి వచ్చేందుకు బొటానికల్ గార్డెన్ జంక్షన్ మీదుగా మసీదు బండ, హెచ్‌సీయూ ఆర్టీసీ డిపో రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.