Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు

ప్రయాణికుల రద్దీ అనుగుణంగా అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్‌ లూప్‌ రైళ్లను నడుపుతారు.

Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎల్‌ అండ్‌ టీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ ఉండటంతో షార్ట్‌లూప్‌ ట్రిప్పులను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది.

 

రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు (Hyderabad Metro)

ఈ షార్ట్ లూప్ ట్రిపుల వల్ల ప్రయాణికులు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రించేందుకు ఈ షార్ట్ లూప్ ట్రిప్స్ ఉపయోగపడతాయిని అధికారులు తెలిపారు. అమీర్‌పేట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ప్రయాణికులు నాగోల్‌ నుంచి వచ్చే మెట్రో కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అమీర్‌పేట్‌ నుంచి రాయదుర్గం వరకు ఈ షార్ట్‌ ట్రిప్స్  ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రోజురోజుకూ ఎండలు ఎక్కువ అవుతున్నాయి.

దీంతో నగరవాసులు కూల్‌ జర్నీ కోసం ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో రైళ్లలో రద్దీ ఎక్కువ అవుతోంది. మరోవైపు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్‌ ఉన్న అన్ని నగరాల్లో ప్రయాణికుల రద్దీ సాధారణ అంశమని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. నగరంలో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా రాయదుర్గం వైపు వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

 

షార్ట్ లూప్ ట్రిప్స్ ఎలా పనిచేస్తాయంటే..(Hyderabad Metro)

ప్రయాణికుల రద్దీ అనుగుణంగా అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్‌ లూప్‌ రైళ్లను నడుపుతారు. దీంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారనుకుంటే ఇవి అందుబాటులోకి వస్తాయి. షార్ట్ లూప్స్ కోసం 12 రైళ్లను సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

నాన్‌ పీక్‌ అవర్స్‌లో ఇప్పటి వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 7 నిమిషాలకు ఒక ట్రైన్‌ ఉండేది. అయితే, తాజాగా దానిని 4 నిమిషాల 30 సెకన్లకు తగ్గించారు. అమీర్‌పేట్‌, రాయదుర్గం కారిడార్‌లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. మరోవైపు అన్ని మెయిన్ మెట్రో స్టేషన్‌లలో అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. రద్దీని కంట్రోల్ చేయడానికి వుమెన్ గార్డులతో సహా సెక్యూరిటీ ని పెంచారు.