Heavy Rains : తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్య నగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
హైదరాబాద్ లో రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అదే విధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడి వాహణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు గ్రేటర్ లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అవసరమైతే తప్ప ప్రజాలు బయటికి రావొద్దని అధకారులు సూచిస్తున్నారు.
అదే విధంగా ఇక మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు.. హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి.
ఆరెంజ్ అలర్ట్.. జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హనుమకొండ.
ఎల్లో అలర్ట్.. అదిలాబాద్, కుమురం భీం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి.