Site icon Prime9

Weather Alert: దంచికొట్టనున్న అత్యంత భారీ వర్షాలు.. ఇంటి నుంచి బయటకు రావద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ డేంజర్‌ వార్నింగ్‌

heavy-rains

heavy-rains

Weather Alert: ఒకవైపు అల్పపీడనం, ఇంకోవైపు నైరుతి మేఘాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనం.. ఈ మూడు కలిసి తెలుగు రాష్ట్రాలపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఎడతెరపిలేని జోరువానతో తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దయ్యాయి. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారి ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీనితో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మరీ ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లవద్దని సూచించింది. నేటి నుంచి మరో నాలుగైదు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 5 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక వాతావరణ శాఖ వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి సహాయకచర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదికి వరదనీరు చేరడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది దానితో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

పాఠశాలలు ఆఫీసులకు సెలవులు(Weather Alert)

ఇప్పటికే కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో శుక్రవారం, శనివారాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆఫీసులకు కూడా రెండ్రోజుల సెలవు ప్రకటించింది. ప్రైవేట్‌ సంస్థలు కూడా సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ.. హైదరాబాదీవాసులకు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్ 9000113667 ను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నాలుగైదు రోజులపాటు కుండపోత వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ఏపీ వాసుల్ని హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఈ అల్పపీడనం ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుందని చెబుతున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో ప్రాంతాల్లో ప్రజలకు బాహ్య ప్రపంచానికి కమ్యూనికేషన్ కట్ అవ్వడం వల్ల వందలాది గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. ప్రజల కోసం ప్రభుత్వం హెల్ప్‌ లైన్ – 1070, 18004250101 ను ప్రకటించింది.

Exit mobile version