Site icon Prime9

Gymkhana ground: జింఖానా రచ్చ.. ఆ ముగ్గురూ ఫెయిల్ అయ్యారా?

Gymkhana

Gymkhana

Hyderabad: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్‌ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఆ మ్యాచ్‌ టికెట్ల కోసం ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. టిక్కెట్ల విక్రయంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అట్టర్‌ప్లాప్‌ అయ్యింది. టిక్కెట్ల కోసం ఎగబడ్డ ప్రేక్షకులను కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ కూడా చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. HCA వైఖరి పై సర్వత్రా విమర్శులు వెల్లువెత్తున్నాయి. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌ టిక్కెట్లను అమ్మే విధానం ఇదేనా అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఆ ముగ్గురున్నా, జింఖానా రచ్చను తప్పించలేకపోయారా? ఇంతకీ ఎవరా ముగ్గురు?

తెలంగాణ క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ గౌడ్ సంగతే తీసుకుంటే, క్రికెట్ ను అభిమానించి, ప్రేమించే విషయంలో ఆయన కూడా ముందుంటారు. అలాంటి వ్యక్తి క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న టీ 20 మ్యాచ్ ను మరింత పకడ్బందీగా జరిగేలా, ఇబ్బందులు లేకుండా చూసుకునే వీలుంది. అవసరమైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను సైతం కంట్రోల్ చేసే అధికారం ఆయనకు ఉంది. ఇక మహ్మద్ అజారుద్దీన్. టీమిండియాకు ఒకప్పుడు కెప్టెన్ గా వ్యవహరించిన ఆయన, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. తన సొంత నగరంలో టీమిండియా మ్యాచ్ జరుగుతున్న వేళ, దాన్ని సాఫీగా జరిగేలా చేయటం ఆయన చేతుల్లో ఉంది. కానీ అజారుద్దీన్‌ కూడా ఘోరంగా విఫలం కావడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక, హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా సీవీ ఆనంద్ ఉన్నారు. విధుల పట్ల ఆయన ఎంత కమిట్ మెంట్ తో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా రాజీ పడని ధోరణి ఆయన సొంతం. దీనికి తోడు వ్యక్తిగతంగా ఆయన క్రికెటర్‌ కూడా. అలాంటి ఆయన ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే జింఖానా గ్రౌండ్స్ ఉంది. ఇలా ముఖ్యులైన ముగ్గురు, క్రికెట్ ను అభిమానించి, ఆరాధించేవారే. అలాంటి వారున్నా కూడా సగటు క్రికెట్ అభిమానికి మాత్రం టికెట్ల కోసం ప్రయత్నించిన వేళ దెబ్బలు తప్పలేదు. ఇదంతా చూసినప్పుడు ముగ్గురు ముఖ్యులు ఉండి కూడా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదన్న భావన కలుగక మానదు.

Exit mobile version