Google Maps: నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.
రాంగ్ అడ్రస్ కు తీసుకెళ్లిన మ్యాప్స్
అదే విధంగా గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనుకున్న ఓ విద్యార్థికి చుక్కెదురైంది.
గూగుల్ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు.
గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు.
దీంతో చేసేదేమీ లేక బాధతో తిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగింది.
ఇంటర్ ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థి(Google Maps)
ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు.
బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను సహకారం తీసుకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్‌లోనే ఎగ్జామ్ సెంటర్ కు బయలుదేరాడు.
అయితే ఇక్కడే గూగుల్ మ్యాప్స్ ట్విస్ట్ ఇచ్చింది. తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు మ్యాప్స్ తీసుకెళ్లింది.
అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలుసుకున్నాడు వినయ్. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ కనుక్కొని అసలైన పరీక్షా కేంద్రానికి వచ్చాడు.
కానీ వినయ్ 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు.
దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు.
ముందు జాగ్రత్తలు అవసరం
పరీక్ష ముందు రోజు సెంటర్ కు వెళ్లి చూసుకోవాలని లేకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావొద్దని ముందు నుంచే విద్యాశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 12నుంచి మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పరీక్ష నిర్వహించారు.
దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పలుచోట్లలో లేటుగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు.