Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు.ప్రొటెం స్పీకర్ ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు ఆయననుస్పీకర్ స్దానం వద్దకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.
అసెంబ్లీ రేపటికి వాయిదా..( Gaddam Prasad Kumar)
గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.ప్రసాద్ కుమార్ అభ్యర్థిత్వానికి బిజెపి మినహా అసెంబ్లీలోని అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఏఐఎంఐఎం మరియు సీపీఐ మద్దతు ఇచ్చాయి.సభలో స్పీకర్ నియామకం తర్వాత నేతలంతా మాట్లాడారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పీకర్ సభలో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.అనంతరం తెలంగాణ అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ సమక్షంలో బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కు చెందిన కేటీ రామారావుతో సహా కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు.