CM Revanth Reddy Comments on kcr in Nizamabad: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించినా ఇంకా మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ అభ్యర్థికి ఓటు వేయాలని అడుగుతున్నారో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. ప్రధాన ప్రతిపక్షం అనే బీఆర్ఎస్‌కు అభ్యర్థులే లేరన్నారు. రాజకీయ పార్టీగా బీఆర్ఎస్‌కు అర్హత ఉందా?అని ప్రశ్నించారు.
తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. కనీసం పోటీ చేయలేని వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా? అని అన్నారు. అందుకే పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. టాటా కంపెనీతో ఒప్పందం నిజమైతే మాకు ఓటెయ్యండి.. యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు నిజమైతే మాకు ఓటెయ్యండి అని కోరారు.
గత పదేళ్లలో ఏ ఉద్యోగానికైనా బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందా? నిరుద్యోగులను పదేళ్లపాటు అనాథలుగా తిప్పింది బీఆర్ఎస్ కాదా? అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 55,163 నియామకాలు చేపట్టింది నిజం కాదా? అని అడిగారు. అందుకే ఆ 55వేలమందికి మేము ఉద్యోగాలు ఇచ్చి ఉంటేనే మాకు ఓటు వేయాలని కోరారు. టీచర్ నియామకాలు చేపట్టి ఉద్యోగాలు ఇచ్చింది నిజం అయితేనే ఓటు వేయాలని చెప్పారు.