Site icon Prime9

CM Revanth Reddy: కేంద్రంపై పోరుకు ఉమ్మడి వ్యూహం.. దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాడాలి

CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌ స‌ద‌స్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

రాష్ట్రాలపై మోదీ కుట్రలు
ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదం వెనక.. ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ’అనే రహస్య ఎజెండా దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నలో కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గుతాయిని, దీంతో కేంద్రంలో శాశ్వతంగా ఉత్తరాది పెత్తనం స్థిరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతి శీల విధానాలతో ఉత్తమ పనితీరు కనబరిచి, కేంద్రానికి గరిష్ట రెవెన్యూ వాటాను అందించే దక్షిణాది నిధులన్నీ సుపరిపాలనను పట్టించుకోని ఉత్తరాదికి వెచ్చించి.. ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీల‌ను, మ‌న హక్కుల‌ను ర‌క్షించుకునేందుకు ద‌క్షిణాది రాష్ట్రాలు చేతులు క‌ల‌పాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

కూటమికి కేజ్రీతో తిప్పలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీదా రేవంత్ రెడ్డి స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలతో హర్యానాలో పోటీకి దిగి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారని, ఢిల్లీలోనూ పొత్తుకు సిద్ధపడలేదని మండిపడ్డారు. ఆయన వైఖరి కారణంగా ఇండియా కూటమి బలహీనమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రాంతీయ పక్షాలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరితే.. మోదీని గద్దె దింపటం సులభమేనన్నారు.

పురోగామి రాష్ట్రం.. తెలంగాణ
తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాద‌ని.. అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ‌ల స్వప్నమ‌ని, ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణ రైజింగ్‌.. విజ‌న్ 2050, ద‌క్షిణాది రాష్ట్రాలు ఎందుకు క‌లిసి ప‌ని చేయాల‌నే దానిపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నామని, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం దిశగానూ ప్రయత్నాలు మొదలయ్యాయని వివరించారు. హైదరాబాద్ ఫార్మా, ఐటీ రంగాలకు నేడు కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. ఫ్యూచ‌ర్ సిటీలో ఏఐ సిటీని, యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు.

ఇదీ తేడా..
ఈ ఏడాది దావోస్‌లో జ‌రిగిన ప్రపంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సులో తమ సర్కారు రూ.1.82 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, నిరుడు మరో రూ.40 వేల పెట్టుబ‌డులు వ‌చ్చాయని గుర్తుచేశారు. కానీ, బీఆర్ఎస్ ప‌దేళ్లలో సాధించింది కేవలం రూ.25 వేల కోట్లేనని లెక్కచెప్పారు. మూసీ ప్రక్షాళన, నగరాభివృద్ధి, పాలనలో పారదర్శకత వంటి అంశాలను గత బీఆర్ఎస్ గాలికొదిలేయగా, తాము వాటిపై దృష్టి సారించామన్నారు.

సమన్వయం కీలకం..
ద‌క్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అందుకే తాము డ్రై పోర్ట్‌ను నిర్మించి, దానిని ఆంధ్రప్రదేశ్‌లోని సీ పోర్ట్‌కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా క‌లపనున్నామని సీఎం పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు తమ వనరులు, పరిమితులను బట్టి ఒకదానికి మరొకటి అండగా నిలిచి, సమన్వయంతో సాగితే మరింత అభివృద్ధి సాధించటం సాధ్యమవుతుందని అన్నారు. ఎంతో ప్రగతి సాధించే అవకాశమున్న తెలంగాణకు కేంద్రం నుంచి ఏ సాయం అందటం లేదని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఆర్థికంగా బలపడితే.. ఆ మేరకు దేశం బలపడినట్లు కాదా అని నిలదీశారు.

Exit mobile version
Skip to toolbar