KTR Attend to ACB Enquiry: ఫార్ములా ఈ కార్ రేసు కేసును ఆరు నెలలుగా విచారిస్తున్నారని.. ఇప్పటికీ ఏం తేల్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతోందని విమర్శించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని తెలిపారు. కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచారని.. ఇంకా ఎన్నిసార్లు పిలిచినా వస్తానని అన్నారు. తనని ఈ కేసులో అరెస్ట్ చేసినా.. అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జైలుకు పోవడం తమకు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నోమార్లు జైలుకు పోయామని గుర్తుచేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాన్ని ఎండగట్టడంలో ఇలాంటివి ఆపలేవన్నారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గమని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు.