Miss World 2025 @Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేటి నుంచి ఈ నెల 31వరకు పోటీలు జరుగనున్నాయి. పోటీల నిర్వహణకు ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జూన్ 1వ తేదీన హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా, 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొననున్నారు.